ఝరి – 81 by S Sridevi

  1. ఝరి – 76 by S Sridevi
  2. ఝరి – 77 by S Sridevi
  3. ఝరి – 78 by S Sridevi
  4. ఝరి – 79 by S Sridevi
  5. ఝరి – 80 by S Sridevi
  6. ఝరి – 81 by S Sridevi
  7. ఝరి – 82 by S Sridevi
  8. ఝరి – 83 by S Sridevi
  9. ఝరి – 84 by S Sridevi
  10. ఝరి – 85 by S Sridevi
  11. ఝరి – 86 by S Sridevi
  12. ఝరి – 87 by S Sridevi
  13. ఝరి – 88 by S Sridevi
  14. ఝరి – 89 by S Sridevi

ప్రహ్లాద్ ఒక సియ్యే కంపెనీలో కుదురుకోగానే అరుణ అతనికోసం పెళ్ళిప్రయత్నాలు మొదలుపెట్టింది. పాతికేళ్ళకల్లా పెళ్ళిచేసుకుని, మరో ఏడాదికి కొడుకుని వెంటేసుకుని తిరుగుతున్న వాసుని చూస్తే ఆమెకి చాలా సరదాగా వుంటుంది. పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవలు అనేది కుటుంబం యొక్క కల. ప్రకృతి చేసే ప్రలోభం.
మూడునాలుగు సంబంధాలు విచారించాక మాధురి సంబంధం వచ్చింది వాళ్ళ దృష్టికి. ఆమె తండ్రి కుటుంబరావు. మనిషి మంచివాడే. ఐతే మంచివాడిగా చలామణీ అవటానికి పరిస్థితులు అతనికి ఎలాంటి వెసులుబాటూ ఇవ్వలేదు. ప్రలోభాలని జయించలేక అతని ఆలోచనలు, మాటలు కొంచెం వక్రంగా మారాయి. అతనికి పెళ్ళప్పటికి సరైన వుద్యోగం లేదు. చిన్నచిన్న టెంపరరీ పోస్టులు చేసేవాడు. అలాగే ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు. ప్రభుత్వోద్యోగానికి వయసుమీరిపోయే టైముకి అతని వుద్యోగం పర్మనెంటైంది. చిన్న వుద్యోగం. ఆస్తిపాస్తులేవీ లేవు. స్వంతంగా యిల్లుకూడా కట్టుకోలేకపోయాడు. ముగ్గురు ఆడపిల్లలు కళ్ళముందు కనిపిస్తూ అతన్ని ఏ చిన్నకోరికా కోరుకోకుండా నియంత్రించారు. తన ఆశలూ, కోరికలూ వాళ్ళ మనసుల్లో నిక్షిప్తపరిచాడు.
ఈ సంబంధం మధ్యవర్తులద్వారా వచ్చింది. అప్పటికి మాధురికి మూడుసార్లు పెళ్ళిచూపులయ్యాయి. పిల్ల నచ్చినా, కట్నాలదగ్గిర తేడా వచ్చి సంబంధాలు తప్పిపోయాయి. పెళ్ళిచేసుకునేటప్పుడు మగవాడు అమ్మాయి తల్లిదండ్రులు స్థితిమంతులా కాదా, ఎంత పెట్టగలరు, అమ్మాయి చదువేమిటి, జీతం ఎంత అనే లెక్కలన్నీ చూసుకునే చేసుకుంటాడు. అమ్మాయికూడా తనకి కనీస భరోసా ఇవ్వలేనివాడిని చేసుకోదు. పెళ్ళిలో డబ్బులెక్కలు కచ్చితంగా వుంటాయి. ఉండవని చెప్పుకోవడం, వుండకూడదని ఆశించడం భేషజం ఔతుంది. పెళ్ళికి కావలసింది ఆదర్శాలూ, భావోద్వేగాలూ కాదు. ఆర్థికమైన భరోసా. ఇల్లు న్డిపించుకోవడం, పిల్లలని క్ని పెంచడం, వాళ్ల చదువులూ, ఇవేవీ ఆదర్శాలో, ప్రేమానురాగాలో తీర్చవు. డబ్బు, సామాజిక బాధ్యతామాత్రమే తీరుస్తాయి.
వాసునీ, సుధీర్‍నీ చూసాక కట్నం తీసుకోవద్దనుకున్నాడు ప్రహ్లాద్. ఇద్దరూ చెరోవిధంగానూ ప్రభావితం చేసారు అతన్ని.
“వాళ్ళకి వున్నది వాళ్ళు పెట్టుకుంటారు. పెళ్ళిచేసేదికూడా ఆడపిల్లవాళ్ళేకాబట్టి, వాళ్ళ తాహతుకి తగ్గట్టే చెయ్యనిద్దాం. రిసెప్షను, వ్రతం మనవికాబట్టి మనకి నచ్చినట్టు చేసుకుందాం” అన్నాడు తల్లితో. అరుణ ఏ విషయమైనా భర్తకే వదిలేస్తుంది. అతనెలా చెప్తే అలా. అలాంటి నమ్మకాన్ని నందకిషోర్ తన సమర్ధతతో సంపాదించుకున్నాడు.
“అదికాదురా, మనకి పెద్దగా ఏమీ లేదు. ఎంతోకొంత తీసుకోకపోతే నువ్వు పైకి రావటం కష్టం. వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకుందాం. డిమాండ్ చేయం” అని నచ్చజెప్పబోయాడు నందకిషోర్. ప్రహ్లాద్ వినలేదు.
“వద్దు నాన్నా! వాళ్లిచ్చే డబ్బుతో నేను పైకి రావడమేమిటి? సుధీర్‍వాళ్ళింట్లో గొడవలు రావటానికి ఆమ్మ అలా అడగటమేకదా, కారణం? గీత వాళ్ళని చిటికెనవేలితో తీసి అవతల పారేసింది. అది మనింటి పిల్లకాబట్టి మనకి అర్థమైంది ఆ విషయం. సుధీర్ మా అందర్లో కలవలేక చిన్నబుచ్చుకుని తిరుగుతున్నాడు. మనం అడిగినంత కట్నం ఇవ్వలేక వాళ్ళు తిరిగిపోతే మనకి చిన్నతనంకాదా? ఒకవేళ ఇవ్వగలిగి పెళ్ళి కుదిరినా, మనింటికి వచ్చే ఆడపిల్లకి చులకనభావం వుండదా? ఇక మనమీద గౌరవం ఎలా పుడుతుంది? గీతేనా మరో పిల్లేనా, లంచం ఇచ్చి భర్తని తెచ్చుకోవాలనుకోరు” అన్నాడు.
ఎదిగిన కొడుకని అతని మాటలకి విలువ ఇచ్చాడు నందకిషోర్. అవతలివాళ్ళుకూడా ఆలోచించుకున్నారు. పెళ్ళికొడుకుది గవర్నమెంటు వుద్యోగం కాకపోవటం వాళ్ళకి కొంచెం ఆక్షేపణీయంగా అనిపించింది. సియ్యే మంచి చదువనీ, ముందుముందు సంపాదన బాగా వుంటుందనీ, మంచి సంబంధమనీ, వదులుకోవద్దనీ కుటుంబరావువైపు బంధువులు బాగా నచ్చజెప్పారు. నందకిషోర్ ఇంకా వుద్యోగం చేస్తున్నాడు. వాళ్ళకి స్వంత యిల్లుంది. రిటైరయ్యాక పెన్షను వస్తుంది. ఒక్క చెల్లెలు తప్ప ప్రహ్లాద్‍కి బాధ్యతలు లేవనేది వాళ్ళకి ఆమోదయోగ్యంగా కనిపించిన అంశం.
“ఇల్లు పిల్లాడికే వస్తుందికదా? ఆ యింటికీ ఆడపిల్ల పెళ్ళికీ ముడిపెడతారా?” అనేది కుటుంబరావు ఆలోచించిన విషయం. అలా ఆలోచించడం ఆయన స్వభావం. భార్య, కమలాక్షి తిట్టింది.
“తెలివితక్కువ మాటలు మాట్లాడకండి. ఇంకా పెళ్ళిచూపులేనా అవ్వలేదు. అప్పుడే వాళ్ళకున్నవాటికి మీరు లెక్కలు వేస్తారేంటి? సంబంధం మంచిది. పిల్లాడిది పాతికేళ్ళ వయసు. సంపాదించుకుంటారు, పైకి వస్తారు. వాళ్ళింట్లో అందరూ అలా పైకి వచ్చినవాళ్ళేనట. ఇంతకీ వాళ్ళకి మనం, మనం ఇచ్చే కట్నం నచ్చాలి” అంది.
పెళ్ళిచూపులయ్యాయి. రామారావునీ, యశోదనీ, తన అన్నగారి కుటుంబాన్నీ వెంటబెట్టుకుని వెళ్ళి వచ్చాడు నందకిషోర్. పోతపోసిన బంగారపుబొమ్మలా వుంటుంది మాధురి. ప్రహ్లాద్ కొంచెం ఎత్తు తక్కువ. అతనికి సరిపడ్డట్టు వుందామె.
“మాకు కట్నం వద్దు. మీ పిల్లకి ఏమి ఇవ్వగలరో అది ఇచ్చుకోండి. దాంట్లోకూడా మా బలవంతం ఏమీ లేదు” అని చెప్పేసాడు నందకిషోర్. కొడుక్కి అతనిచ్చిన విలువ అది. అది కుటుంబరావులో మరో అనుమానాన్ని రేపింది.
“కట్నం అక్కర్లేదంటున్నారు, పిల్లాడిలో ఏదేనా లోపం వుందేమో!” అన్నాడు. అతని బంధువులు ఈమాటు కొట్టినంత పని చేసారు.
“వాళ్ళు కట్నంరూపంలో డబ్బు ఇవ్వద్దన్నారు. అంతే! మీ పిల్లకీ ఏం పెట్టుకుంటారో పెట్టుకొమ్మన్నారుకదా, నువ్వెందుకు తగ్గాలి? వడ్డాణం, కాసులపేరు, వజ్రాల నెక్లెసుసెట్టు చేయించి పెట్టు” అని ఎద్దేవా చేసారు. మొత్తానికి ఆయన నోరు గట్టిగా మూయించి ఓవైపు కమలాక్షి, మరోవైపు ఆవిడవైపువాళ్ళు, ఇంకోవైపు ఆయన అన్నదమ్ములు వ్యవహారం నడిపితే, నిశ్చయతాంబూలాలదాకా వచ్చింది వ్యవహారం.
నిశ్చయతాంబూలాలకి అన్ని కుటుంబాలవాళ్ళూ వచ్చారు. గీత పెద్దకోడలు, సుమతి పెద్దాడబడుచు. అంతా బాగానే సాగింది. ప్రమీలకి పెళ్ళికావల్సిన ఇద్దరు మగపిల్లలున్నారు, వాళ్ళిద్దరూ డాక్టర్లు. వీళ్ళిద్దరు భార్యాభర్తలూ వుద్యోగస్తులు. అల్లుడుకూడా డాక్టరు. ఆ మెరుపుల్లో ఇంకెవరూ కనిపించలేదు కుటుంబరావుకి. పడిపడి మర్యాదలు చేసాడు. మిగతావాళ్లందరికీ సుధీర్, సుమంత్‍లతోపాటు మిగిలిన మగపిల్లలుకూడా కనిపించారు. మాధవ్ కళ్ళు నీలిమకి అతుక్కుపోయాయి. ఆమెకూడా అతన్ని ఓరోరగా చూసింది.
పెళ్ళీ, అంపకాలూ అయాయి.
మామూలు పద్ధతిలో తమింటికి భోజనాలకి పిలిచాడు రామారావు కొత్తదంపతులని. పదేపదే అక్కా అక్కా అని గీతని మాధురి పిలుస్తుంటే విన్నాడు ప్రహ్లాద్. గీత ఇబ్బంది పడుతోంది అలా పిలవద్దని చెప్పడానికి.
“గీత మా అందరికన్నా బాగా చిన్నది. మీ యిద్దర్లోకూడా నువ్వే పెద్ద. వరసలు వద్దు. పేర్లు పెట్టి పిలుచుకోండి” అన్నాడు.
“బావగారు ఏమన్నా అనుకుంటారేమో!” అంది మాధురి.
“బావగారెవరు? ఒహ్! వాసా? వాడు నాకన్నా ఎక్కువ పెద్దేమీ కాదు. పేర్లు పెట్టి పిలుచుకోవడమే మొదట్నుంచీ మాకు అలవాటు. చిన్నది పల్లవికూడా వాసూ, ప్రహీ అనే అంటుంది. అమ్మమ్మావాళ్ళకి కొన్ని పట్టింపులుంటాయి. అందుకు వాడినొక్కడినీ వరసపెట్టి పిలిస్తే చాలు” అన్నాడు.
ఈ యిల్లు చూసింది మాధురి. వాసు ఇల్లు చూసింది. గీత, వాసు రెండుజీతాలవాళ్ళన్న విషయం మనసుకి ఇంకింది. ఎక్కడికి వెళ్తే అక్కడ గీతకి జరుగుతున్న మర్యాద, ఆమెకిగల ప్రాముఖ్యత చూసింది. పిల్లలంతా ఆమె చుట్టూ తిరగడం చూసింది. ముఖ్యంగా తన స్వంత అత్తమామలకికూడా గీతంటే ప్రాణం అన్న విషయం ముల్లులా గుచ్చుకుంది. ఆ ముల్లు నిరంతరాయంగా ఆమెని కెలుకుతునే వుంది.


మాధవ్ గ్రూప్స్‌లో సెలెక్టయాడు. పోస్టింగ్‍కూడా ఇచ్చారు. గీత వెంటవెంట తిరుగుతున్నాడు, ఏదో చెప్పాలని. ఆమెకీ అర్థమైంది. సుమతి పెళ్ళిలో సుమంత్‍కూడా అలానే తిరిగాడు. లతని వెంటేసుకుని. ఇక్కడ మాధవ్ వెంట ఏ పిల్లా లేదు, మనసులో దాచుకున్నట్టు తెలుస్తోంది.
“చెప్పరా!” అంది నవ్వుతూ.
“అనుభవజ్ఞురాలివి, కనిపెట్టేసావ్” అన్నాడు మాధవ్ తనూ నవ్వేసి.
“దేన్లో?”
“అబ్బా! తెలీనట్టు మాట్లాడకమ్మా”
“నేను వంద అనుకుంటాను, వెయ్యి గెస్ చేస్తాను. నువ్వేది అనుకుంటున్నావో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది?”
“నీతో నెగ్గడం కష్టంగానీ, నేనే చెప్పేస్తాను” అని దారికి వచ్చాడు మాధవ్.
“నీలిమకి సంబంధాలు చూడద్దని ప్రహ్లాద్‍కి చెప్పవా? ప్లీజ్! వాడితో అంటే వదినతో తను చెప్తాడు. వదిన వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తుంది” అన్నాడు.
“ఈ డొంక తిరుగుడంతా దేనికి?” నవ్వాపుకుంటూ అడిగింది గీత.
“చచ్చిపోతున్నాం ఈ పిల్లతో. ఆరేళ్ళు మాట్లాడకుండా వుండి వాసుగాడికి ఏం సందేశాలిచ్చావు నువ్వు? అలాగే ఇదీను. ఇంకా తులసి చిన్నది. దానికి పెళ్లయేదాకా ఆగాలి. ఈ విషయం తెలిస్తే వాళ్ళు నీలిమ పెళ్ళికి తొందరపడరని”
“నీలిమకి చెప్పావా?”
తలూపాడు.
“తను చెప్పదా వాళ్ళింట్లో?”
“చెప్తుంది. అది చాలదుకదా? మనవైపునించీకూడా భరోసా యిస్తే వాళ్ళు నమ్ముతారు” అన్నాడు.
“ముందు అత్తకి చెప్పాలి. అత్తా, వాసూ చూసుకుంటారు ఆ విషయాన్ని”
“అమ్మకి నువ్వు చెప్పవా?” అన్నాడు బతిమాలుతున్నట్టు.
“మీ అన్నయ్యప్పుడు ఎవరు చెప్పారో?”
“మీ యిద్దరూ కారణజన్ములట”
“అబ్బా! అంత మోసెయ్యకు. సరేగానీ, తులసికి చదువుమీద శ్రద్ధ లేదు. ఇంటరవగానే పెళ్ళి చేసేస్తానంటోంది అత్త” అంది గీత.
“అదింకా చిన్నపిల్ల. ఇప్పుడే పెళ్ళేంటి వదినా?” అన్నాడు మాధవ్ కలవరపడుతూ.
“చదువుమీద శ్రద్ధ వుంటే సరే, లేకపోతే ఖాళీగా వుంచడం దేనికని అత్త ఆలోచన. ఐనా అనుకున్న వెంటనే కుదరద్దూ?”
“ఇంటరయ్యాక డిగ్రీలో చేర్పిద్దాం. కాలేజికి వెళ్ళి వస్తుంది. అదేం బ్రహ్మాండంగా చదివేసి పాండిత్యం చూపించక్కర్లేదు”
“ముందు ఇంటరవనీ. కృష్ణా, వల్లీ, సమీరా, ఇదీ వున్నారు ఈ యేడాది ఇంటరుకి. కృష్ణది లెక్కల గ్రూపు. వల్లీ, సమీరా సైన్సు తీసుకున్నారు. తులసి ఆర్ట్స్ తీసుకుంది. లిటరేచర్లో బానే వుందిగానీ, మిగతావాటిల్లో గట్టెక్కడం అనుమానమే. అన్నీ బట్టీపట్టేస్తోంది. అలా చదవరే అన్నా వినట్లేదు”
అక్కడితో వాళ్ళ సంభాషణ ఆగిందిగానీ వ్యవహారంమాత్రం ముందుకి సాగింది.
“తెలిసిన ఇంట్లో పిల్లైతే మంచిదే” అంది లక్ష్మి గీతద్వారా విని సాలోచనగా.
“మన పెళ్ళిగురించి నేను టెన్షను పడుతుంటే కొబ్బరుండలు ఇవ్వబోయేడు. వీడికి నేను సాయం చేయాలా” అన్నాడు వాసు కినుకగా.
అరుణద్వారా వియ్యాలవారికి చేరింది వార్త, మాధవ్ నీలిమని చేసుకుంటాడని. డాక్టర్లిద్దర్లో ఒకళ్ళు కాకపోవడం కుటుంబరావుకి కొంచెం నిరాశ కలిగించిందిగానీ మాధవ్‍ది గవర్నమెంటు వుదోగం కావటం, అదీ పెద్దదవటం వూరట కలిగించింది. ఇక్కడా కట్నకానుకలు లేకపోవటం ఇంకో ఆశకి వూపిరి పోసింది. నీలిమ పెళ్లైన తర్వాత వసంత్‍కి వాళ్ళ చిన్నకూతుర్ని అడిగారు.


తులసి ఇంటరు మూడు సబ్జెక్టులు తప్పింది. మిగిలినవాళ్ళు మంచిమార్కులతోనే పాసయ్యారు. వాసు, మాధవ్‍ల అభ్యంతరాలు పట్టించుకోకుండా తులసికి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది లక్ష్మి.
తులసికి పెళ్ళి. గీతకి ఆ పిల్లంటే ప్రాణం. తను ఇరవయ్యేళ్ళ వయసులో వాసుని చేసుకుని యీ ఇంటికి వచ్చింది. అందరూ చక్కగా చూసుకుంటారు. తులసిది ఇంకా చిన్నవయసు. దగ్గరి సంబంధాలు లేవు. ఎదురు మేనరికం ఐనా పర్వాలేదనుకున్నా, కృష్ణకన్నా నెలలు పెద్దది. ఆలోచించడానికికూడా ఇంకెవరూ లేరు. దూరపుసంబంధం చేస్తే వాళ్ళెలా చూస్తారో! ఎంతో మథనపడింది. వాసుకూడా అలానే ఆలోచించాడు.
పెద్దమేనత్త తోడికోడలి కొడుకు అతని ఆలోచనలోకి వచ్చాడు. ఉభయతారకమైన సంబంధం అది. తులసికి మేనత్త అండ వుంటుంది. ఆ కుటుంబలోని కొంత ఆస్థి ఆవిడ పేరుమీద వుంది. అది ఆవిడ భర్త వాటా. ముందుముందు అది తిరిగి కుటుంబంలోకి చేరిపోవచ్చు.
అబ్బాయి శ్రీధర్. స్ఫురద్రూపి. పాలిటెక్నిక్ చదివి వుద్యోగం చేస్తున్నాడు. ఈసెట్ రాసి, ఈవెనింగ్ కాలేజిలో బియ్యీ చదువుతున్నాడు. ఇంకో ఏడాది చదువుంది. వాళ్ళకీ తులసి నచ్చింది. పెళ్ళిచూపులూ మాటలూ అయ్యాయి. చదువవ్వగానే చేసుకోవడానికి వప్పందమైంది. అన్నీ మాట్లాడుకుని తాంబూలాలు తీసుకున్నారు. వాళ్ళ పెళ్ళి జరిగిన ఆర్నెల్లకి మాధవ్ పెళ్ళి నీలిమతో జరిగింది.