గీతకి కొడుకని ఫిక్సైపోయావేమిటి? నాకుమాత్రం వద్దు. ఇంట్లో వాళ్ళిద్దరితోటీ, ఇల్లుదాటితే వీళ్ళు ఐదుగురితోటీ బోల్డు కష్టాలుపడ్డాను. ఆడపిల్లైతే బావుంటుంది- అంది.
మగపిల్లల్తో తిరిగి తిరిగి మీ నలుగురూ సిగ్గూఎగ్గూ వదిలేసారేమిటే-అంది మామ్మ దాని నెత్తిన చిన్నగా మొట్టి.
సిగ్గుపడుతునే వున్నానమ్మమ్మా! మర్చిపోయినా అమ్మ గుర్తుచేస్తుంటుంది- అంది.
నేనుకూడా గుర్తుచేస్తుంటాలే సుమతీ! పక్కనే వుంటాగా!- అన్నాడు జో పెద్దగా నవ్వి.
నవ్వాగలేదు నాకు. నవ్వేసాను. వాసు తలపట్టుకున్నాడు.
వీళ్ళు నలుగురు బావా! మహామేథావులని చెప్పుకోదగ్గవాళ్ళు. ఇక్కడ ఇద్దర్ని చూస్తున్నారు. ఇంకో ఇద్దర్ని చూడబోతున్నారు. వీళ్ళ గైడెన్స్‌లో మరో ఆరుగురు తయారౌతున్నారు – అన్నాడు. జో నవ్వుతునే వున్నాడు.
వాళ్ళు వెళ్ళే సమయం వచ్చింది. మామ్మ సుమతిని దగ్గిరకి తీసుకుని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది. బుద్ధులు చెప్పింది. దాన్ని జాగ్రత్తగా చూసుకొమ్మని జోకి చెప్పింది.
ఆ తర్వాత మరోవారానికి మాయింటికి పిలిచాం. వాసు వాళ్ళింటికి వెళ్ళి ఆహ్వానించి వచ్చాడు. వాళ్లంతట వాళ్ళు వచ్చేస్తామన్నారు. వాళ్లకి పెట్టడానికి మేమిద్దరం వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చాం. మాధవ్, తులసి ఇంట్లోనే వున్నారు. అత్త, నేను, తులసీ కలిసి వంట చేసేసాం. వాళ్లకోసం ఎదురుచూస్తుంటే ఇంటిముందు బైక్ ఆగింది. అత్త వెళ్ళింది. వాసూవాళ్ల నాన్నని పలకరించి లోపలికి వచ్చారు.
అవంతీపురంవాళ్ళ ఏడుగురు రాజకుమారుల్లో ఇదుగో, వీడు ఐదోవాడు. సివిల్స్, గ్రూప్స్ రాస్తున్నాడు- అంది సుమతి మాధవ్‍ని పరిచయం చేస్తూ. అమ్మావాళ్ళింట్లో వాసు మన నలుగురినీ మహామేథావులన్నమాట గుర్తుపెట్టుకుని రిపార్టీ ఇచ్చింది. రాజకుమారుడంటే ఏ పనీ చేతకాని సుకుమారుడని మన కోడ్. వాళ్లు నలుగురూ మాట్లాడుకుంటూ వుంటే నాకు వాళ్లమధ్య స్థానం లేదనిపించింది. తులసికూడా వాళ్లతో చేరిపోయింది. అత్తదగ్గిరకి వెళ్ళిపోయాను.
ఏమైందే, అలా వున్నావు- అడిగింది అత్త.
ఏం లేదు. నేనిప్పుడు సుమతిని వదినా అని పిలవాలా- అన్నాను.
ఏమైనా అనుకున్నారా, ఇద్దరూను? సుమతి అలా పిలవమని చెప్పిందా? నీకన్నా పెద్దదికదా, అతనిముందు పేరుపెట్టి పిలిస్తే బావోదని అందేమో! పోనీ అలానే పిలు- అంది.
మా పెళ్లప్పుడు మగపిల్లలందరికీ అలానే చెప్పారు, నేను వాళ్ళకి వదిన్నని. వాళ్ళు గిజగిజలాడారు. వాళ్లంతా వాసుదగ్గిర మొరపెట్టుకున్నారట, ఇంతకన్నా అన్యాయం వుండదని. ఇప్పుడు నావంతా? సుమతి ఒక్కదాన్నేనా, మహీనీ, రవళినీకూడా అలానే పిలవాలా?
ఏమో! నాకేం అర్థం కావట్లేదు- అంటూ అక్కడినుంచీకూడా వెళ్ళిపోయాను. కాలుకాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగాను. వాసు రమ్మన్నాడని తులసి వచ్చి నన్ను పిలుచుకుపోయింది. అత్తలు ఆరుగురూ కూర్చుని మాట్లాడుకుంటుంటే అమ్మ ఎలా పక్కకిపక్కకి తప్పుకునేదో, వాళ్లమధ్యని పరాయిగా ఫీలయ్యేదో ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్లలో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. అమ్మని గౌరవంగా చూస్తారు. ఎప్పుడూ ఒక్కమాటకూడా అనరు. మామ్మకూడా అనదు. ఐనా పరాయితనం. అలాంటిది నాకు అనుభవంలోకి వచ్చింది.
భోజనాలకి లేచినప్పుడు ఇల్లు చూపించింది సుమతి జోకి.
నేను చెప్పానా, వీళ్ళిల్లు చాలా పెద్దదని. చిన్నప్పుడు అందరం ఈ చుట్టుపక్కలే వుండేవాళ్ళం. స్కూలునించీ ఇంటికెళ్తూ ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. ఆటలు, చదువు అన్నీ ఇక్కడే, ఈ అరుగుమీదే. కనకాంబరాలు, జాజిమొగ్గలు, మరువం తెంపి వుంచేది పిన్ని. అవన్నీ మాలకట్టి పెట్టుకునేవాళ్ళం. పొద్దుపోయేక ఎవరిళ్ళకి వాళ్లం వెళ్ళేవాళ్ళం- అంది. ఆ అరుగూ, దానికి ఎదురుగా బావీ, చుట్టూ మొక్కలూ. చాలా నచ్చాయి జోకి. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే కాలం తెలీలేదు. రాత్రిదాకా వుండిపోయారు. ఆరోజు పౌర్ణమి కావడంతో చాలా థ్రిల్లయ్యాడు.
భార్యాభర్తలిద్దరే ఏకాంతంలో అనుభవించాల్సిన వున్మత్తమైన వెన్నెల అది. మా గదిలో కిటికీ చాలా పెద్దది. అందులోంచీ ప్రవాహంలా దూకుతూ వుంటుంది వెన్నెల. కిటికీ పక్కని జాజితీగ పెట్టాను. అది ఇప్పుడిప్పుడే అల్లుకుంటోంది. రాత్రి భోజనాలుకూడా అయాక వాళ్ళిద్దరు బయల్దేరారు.
ఇలాంటి యిల్లుంటే ఇంకేమీ అక్కర్లేదు. సూర్యుడూ చంద్రుడూ కిటికీకి కట్టేసిన గాలిపటాల్లా వున్నారు- అన్నాడతను.
అప్పుడప్పుడు వస్తుండండి- అంది అత్త.
నాకింకా సుమతిని వదినా అని పిలిచే అవకాశం రాలేదు. పిలిస్తే తన కోపం తగ్గుతుందేమోనన్న ఆశకూడా కలిగింది.
బ్రిటిష్‍వాళ్ళు ఈపాటి యిళ్ళకికూడా కేజిల్సని పేర్లు పెట్టేసుకుంటారు. ఆ లెక్కన మీకు రెండుకోటలున్నాయి. సైన్యం వున్నారు. కమేండర్ అనచ్చు. రింగ్‍లీడర్ అంటే మరీ చిన్నపిల్లలవ్యవహారంలా వుంది- అన్నాడు జో వెళ్ళేముందు నాతో.
తులసికికూడా ఒక కోట వుందికాబట్టి అవంతీపురం రాజకుమారి అనడంలో తప్పులేదని తీర్మానించాడు. అతను సరదాగానే వున్నాడుగాని సుమతి ఆపుతోంది. దానికి ఇష్టంలేనిది అతనెందుకు చేస్తాడు? క్రమంగా దూరం జరిగిపోయారు వాళ్ళు. దూరమా అంటే పూర్తి దూరమూ కాదు.
అందరం కూర్చుని మాట్లాడుకుంటుంటే నువ్వెక్కడికి వెళ్ళావే? వంటంతా పొద్దున్నే చేసేసుకున్నారుకదా? ఇంకేం పెత్తనాలు చేసావు? సమస్యేదైనా వున్నప్పుడు పక్కకి వెళ్ళిపోయి కళ్ళుతుడుచుకోవడం కాదు, ఎదురునిలబడాలి. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు. నాపక్కనే నువ్వు వుండాలి- అన్నాడు వాసు వాళ్ళు వెళ్ళాక.
దాన్ని వదినా అని పిలుస్తానన్నావుకదా? పిలవలేదేం? ఏదో ఒక మిషపెట్టుకుని పిలవాల్సింది. మళ్ళీ వాయిదా ఎందుకు- అడిగింది అత్త.
సుమతి… వదినా- అని అడిగి పగలబడి నవ్వాడు మాధవ్.
సీతాకోకచిలుకలే మీరంతా! రెక్కలాడించేస్తున్నారు. నువ్వేమో మా అందరికీ వదినవి. నీకేమో అది వదినా- అన్నాడు.
మయూ పుట్టాక సుమతికి కొడుకు. వాడిన బట్టలూ అవీ పంపిస్తే అతనేమైనా అనుకుంటాడేమోనని పిల్లల బట్టలు పంపలేదు.
నా కొడుకు మేనమామల బట్టలు తొడుక్కోనక్కర్లేదా? మనింటి వుయ్యాల వాడికి వద్దా- అని అడిగి రప్పించుకుంది. ఇంట్లో సాంప్రదాయంగా వస్తున్నవి ఏవి జరక్కపోయినా మనని వేరుగా చూస్తున్నారనిపిస్తుంది. తనూ అలానే అనుకుంది. బట్టలన్నీ జాగ్రత్తగా మడతలు పెట్టి, ఉయ్యాలతోపాటు ఇస్తే మామ్మ, రవి బాబాయ్ తీసుకెళ్ళి ఇచ్చారు.
ఇంట్లో పెద్దగా ఏవీ కొనే అవసరం లేకపోవడం, ఏ వస్తువు కావాలన్నా ఎవరో ఒకరింట్లో వుండటం, నడకరావటానికి వాడే తోపుడుబండి, మూడుచక్రాల సైకిలు ఇలా పిల్లల వస్తువులు ఒకళ్లదగ్గిర్నుంచీ ఇంకొకళ్ళకి బదిలీఅవడం, అవసరానికన్నా ముందే అవి ఎవరో ఒకరు చేర్చవలసినచోటుకి చేర్చడం చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత సుమతి మారింది. చాలా” అంది గీత.
“అది మారింది నిజం. అంతా పైపై మార్పు. దాని స్వభావం మారలేదు. మనందరిమీదా దాని ప్రేమ, అభిమానం చెక్కుచెదరలేదు. నాకోసం అప్పుడు ఎంతో ఆదుర్దాగా ముంబై వచ్చింది. గీతూ! నువ్వు ఎప్పుడు వెళ్ళమన్నావో అప్పుడే వచ్చింది తప్ప స్వతంత్రించలేదు. ఐనా, మా అమ్మ పోయినప్పట్నుంచీ మీరిద్దరూ మాట్లాడుకుంటునే వున్నారుకదా?” అంది మహతి.
“చాలా విషయాలు చెప్పాలని వుంది మహీ! నా యీ ప్రేమలూ, బంధాలూ అన్నీ చిక్కుముళ్ళలా మారిపోయి, ఆలోచనలన్నీ గజిబిజిగా ఐపోతుంటాయి. రాత్రి మంచంమీద పడుక్కుని ఒక్కదాన్నే ఆలోచించుకుంటూ వుంటాను. అన్నీ మా ఇద్దరికీ తెలిసినవేకదా, వాసుకి చెప్పడానికి ఏవీ ప్రత్యేకంగా తోచేవి కాదు. నీతోకూడా ఏమీ చెప్పాలనుకోలేదు. నా దృష్టిలో మనం అందరం ఒకటే. విడిగా ఏం చెప్పాలో తెలీలేదు. కానీ నీతో చెప్పడం మొదలుపెట్టాక అర్థమైంది, ఒకే సంఘటనలో మనం అందరం వున్నా, ఎవరి దృక్కోణం వాళ్ళదని” అంది.
ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని, ప్రేమగా అంది మహతి, “వాసుకూడా ఆ భరోసామీదే వున్నాడు, తనకి చెప్పనివికూడా నాకు చెప్తావని” అని.
“తనకి తెలీనివీ, చెప్పకూడనివీ ఏవీ లేవు. కానీ నాకే ఏదో దు:ఖం. ఎడతెగట్లేదు” కళ్ళుతుడుచుకుంది గీత. మళ్ళీ మొదలుపెట్టింది.
“బారసాల ఐపోయిన మర్నాడు మయూఖ్‍ని చూడటానికి సుధీర్ వచ్చాడు. వాసు ఆఫీసుకి వెళ్ళాడట, ఇద్దరూ కలిసివచ్చాడు. తనలో ఒక్కోసారి చూసినప్పటికీ మార్పు తెలుస్తోంది.
నిన్న రాలేదేరా, అందరూ వచ్చారు. నువ్వూ రాణాతప్ప మీ పిల్లసైన్యంకూడా అందరూ వచ్చారు. నువ్వు లేకపోవటం వెల్తిగా అనిపించింది- అంది మామ్మ.
నిన్న ఓపీలో చాలా రష్ వుంది అమ్మమ్మా! నాతో చేసే మరో డాక్టరు రాలేదు. దాంతో ఎక్కడా వీలు చిక్కలేదు. రాణా ఎందుకు రాలేదట- అడిగాడు. ప్రశ్నకి జవాబుకోసం ఎదురుచూడకుండా కాళ్ళుచేతులూ కడుక్కుని వచ్చి, వుయ్యాల్లోంచీ మయూఖ్‍ని తీసుకున్నాడు. పల్లవితో మొదలుపెట్టి అందరికీకూడా ఎంత చంటిపిల్లల్నేనా ఎత్తుకోవడం బాగా వచ్చు. వాడిని తదేకంగా చూస్తూ వుండిపోయాడు. ఆ మనిషిని అలా చూస్తుంటే గుండెలుపగిలేంత దు:ఖం మోస్తున్నాడనిపించింది. మనింట్లో మగపిల్లలందరికీ నాన్న రోల్‍మోడలు. అత్తలు అలా చెప్పి పెంచారు వాళ్ళని. అతనిది ప్రేమే అనుకున్నా, పోగొట్టుకున్నది నన్నొక్కదాన్నే కాదు, నాద్వారా మాయింట్లో దొరికే శాశ్వతస్థానాన్ని, నాన్నతో ఇంకా బలపడాల్సిన అనుబంధాన్ని, వాసుతో కనీకనిపించని పోటీలో విజయాన్ని.
భోజనం చేద్దువుగాని రారా! ఎప్పుడు తిన్నావోను- అంది మామ్మ.
వాసు పిల్లాడిని తీసుకున్నాడు.
నువ్వు- అడిగాడు సుధీర్.
నాదైపోయిందిరా! అన్నం తినేసే ఆఫీసుకి వెళ్తాను. మధ్యాహ్నం లైటుగా తింటాను- అన్నాడు వాసు.
ఐతే నాతోకూర్చుని ఏదో ఒకటి తిందువుగాని- అని లేవదీసాడు సుధీర్. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి.
ఒక్కడివీ వేరే వుండటం దేనికిరా, సుధీర్? అమ్మావాళ్లతోటే వుండచ్చుకదా- అడిగింది మామ్మ.
ఇందులో కొత్తేముంది అమ్మమ్మా? చదువుకుంటున్నప్పట్నుంచీ అలవాటేగా- అన్నాడు.
అదివేరు, ఇదివేరు. పోనీ, వాళ్లనే నీదగ్గిరకి రమ్మనకపోయావా- అడిగింది.
ఇద్దరి ఆఫీసులకీ బాగా దూరమౌతుంది. ఈ వయసులో అంత కష్టపడటం దేనికి- తన జవాబు.
ఇప్పుడింత కష్టపడుతూ ఇప్పుడు నీకీ వుద్యోగం దేనికిరా- అన్న ఆవిడ ప్రశ్నకి,
చదువైపోయాక జాబ్ చెయ్యకుండా ఏం చెయ్యను? ఇల్లమ్మేసాం కదమ్మమ్మా! ఎంతోకొంత సంపాదించి మిగిల్చితే, నాన్న రిటైరయ్యాక ఆ డబ్బుకి కలిపి మరోటేదైనా కొనాలని ఆలోచన- అన్నాడు.
పెద్దకొడుకువి, ఆపాటి ఆలోచించుకోవాల్లే. పోనీ నేనొచ్చి వుండనా, నీతో? వేళకి వండిపెడతాను- అంది.
మావి బేచిలర్స్ క్వార్టర్సు అమ్మమ్మా! నువ్వు వచ్చి వుండటానికి వీలుగా వుండదు. వద్దువుగాని. ఇల్లు కొన్నాక వచ్చి, నీకు తోచినన్నిరోజులు వుందువుగాని- అన్నాడు చిన్నగా నవ్వి.
నాన్న భోజనానికి వచ్చారు. సుధీర్ని చూసి చాలా సంతోషపడ్డారు. మన కుటుంబంలో మొదటి డాక్టరని ఎంతో గర్వం. ఎందరికి చెప్తారో!
ఎలా వున్నావురా? ఉద్యోగం ఎలావుంది? పనిధ్యాసలో పడి తిండీ అదీ మానేసావా, ఇలా చిక్కిపోయావు- అంటూ ప్రశ్నలు అడిగారు. సుధీర్‍కూడా నాన్న తింటున్నంతసేపూ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాడు. భోజనాలయ్యాక, నాన్న, వాసు ఆఫీసులకి బయల్దేరారు. సుధీర్‍కూడా వెళ్తానని లేచాడు.
నేను డ్రాప్ చేస్తాను- అన్నాడు వాసు.
ఆటోలో వెళ్ళిపోతాలేరా- అన్నాడు సుధీర్.
మాట్లాడకుండా బైక్ ఎక్కరా- అన్నాడు వాసు.
ఇద్దరూ వెళ్ళిపోయారు.
సుధీర్ని అలా వదిలెయ్యకండిరా! కాస్త గమనిస్తూ వుండండి- సాయంత్రం వచ్చాక వాసుతో మామ్మ అంది.
ఎందుకొదిలేస్తాం? వాడే నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. ఐనా వీడిగురించి చూసుకోవడానికి సుమంత్ వున్నాడుగా? ఇంక ఈ చుట్టరికాలు తగ్గించుకుంటేనే మంచిదని వాళ్ళ వుద్దేశ్యం కావచ్చు. సుమతి దీంతో మాట్లాడ్డం మానేసింది. అంత తప్పేం చేసింది గీత? ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని చెప్పాం. పెద్దవాళ్ళు నిలబడి పెళ్ళిచేసారు. అందుకు దీన్ని సాధించడమేమిటి- అన్నాడు వాసు.
అలాంటిదేమీ వుండదురా! మీ అమ్మావాళ్ళు ఆరుగురికీ గీతని పెద్దకోడలని చెప్పుకుంటున్నారా, ఇది పెద్దకోడలైనప్పుడు అది పెద్దాడబడుచు కాదా? కాస్త గోటుపోతోందేమో- అంది మామ్మ.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.