మనిషి ఎప్పుడో జరిగిన విషయాలని ఇప్పటి కోణంలోంచీ విశ్లేషిస్తాడు. అప్పుడిలా చేసి వుంటే బావుండేదని ఇప్పటి పరిస్థితులనిబట్టి అనుకుంటాడు. ఇప్పుడున్నన్ని అవకాశాలు ఆరోజుని త్రిమూర్తులికి లేవు. అప్పుడతను చిన్నవాడు. అతని స్వతంత్రత తల్లీమేనమామల చేతుల్లో వుంది. సమాజం మరోలా వుంది. అతని వికాసం ఆకాలానికి తగ్గట్టు వుంది. అలా చేసి వుండకూడదని ఇప్పుడనిపిస్తోంది. అప్పుడు అనిపించలేదు. అప్పుడు అనిపించని విషయానికి అప్పుడు కలగని బాధ ఇప్పుడు కలగడమేమిటో, అదీ నిలువునా దహించేసేంత తీవ్రంగా వుండటమేమిటో ఆయనకి అర్థమవ్వలేదు. అమృతని చూసి బీజమాత్రంగా వుండిపోయిన అపరాథభావన తలెత్తిందా? తెలీలేదు.
“విజయ్ విషయం మీదాకా వచ్చిందా?” అడిగాడు శ్యామ్మోహన్ సందిగ్ధంగా.
“తప్పేం వుంది అందులో? మా యింటికోడళ్ళెవరూ డబ్బున్న యిళ్ళనుంచీ రాలేదు” అన్నాడు త్రిముర్తులు.
“మాధవకి అలాంటి ఆలోచన వున్నట్టు లేదు”
“ఎందుకు లేదు? ఆ పిల్లకేం తక్కువ? తల్లిదండ్రులు తగలేసిన నాలుగుకోట్ల అప్పు తీరుస్తోంది. చదువుంది, వుద్యోగం వుంది, రూపం వుంది”
“ఈ యింటిదగ్గర తటపటాయిస్తున్నారు”
“నేను కొంటానంటున్నానుకదా?”
“అది మీఅందరి డబ్బేకద తాతయ్యా!”
త్రిమూర్తులు తల అడ్డంగా వూపాడు. “నాది. నావాటా డబ్బులోంచీ కొంటున్నాను. ఉమ్మడిలోంచీ కాదు”
“ఏదైనా వాళ్ళు పంచుకునేదేగా?”
ఆయనకి కోపం వచ్చింది. “ఐతే? నాది కాకుండా పోతుందా? నా వాటాసొమ్ము నేను ఏమైనా చేసుకుంటాను. దారినిపోయే దానయ్యకి యిచ్చుకుంటాను. మిగిలిందే వీళ్ళది. వీళ్ళెవరు అడగడానికి? పేపర్లు సిద్ధం చేయించు” అన్నాడు.
శ్యామ్మోహన్ తలూపి అక్కడినుంచీ వచ్చేసాడు. అలాగేనని వాయిదా వేస్తూ ఇంకో మార్గం ఆలోచించాలనేది అతని ఆలోచన. విజయ్ అంత దూరాన్న కనిపించాడు.
“పెద్దతాతయ్యకి ఆ సలహా ఇచ్చింది నేనే. పేపర్స్ తయారుచేయించండి బాబాయ్” అన్నాడు, దగ్గరికి వచ్చి నవ్వుతూ. అందులో అల్లరీ, కొంటెతనం వున్నాయి.
శ్యామ్మోహన్ నవ్వలేదు. ముఖం సీరియస్‌గా పెట్టాడు. “పద, కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు. ఇద్దరూ కలిసి కేంటిన్‌కి వెళ్ళారు. విజయ్ ఇద్దరికీ టీ తీసుకొచ్చాడు. ఇరవయ్యారేళ్ళో, ఇరవయ్యేడేళ్ళో అతనికి- సరిగ్గా గుర్తురాలేదు శ్యామ్మోహన్కి. అంత తెలుపూ నలుపూ కాని శరీరచ్ఛాయలో సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ఏవో చిన్నాపెద్దా వుద్యోగాలు చేసి, తనకి సరిపోయేది సంపాదించుకుంటాడు. పెద్దగా పెట్టుబడిలేని వ్యాపారం మొదలుపెట్టాలని అతని కోరిక. అది త్రిమూర్తులి రక్తంలోనే వుంది. చీరలకొట్టు తప్పించి మిగతావన్నీ పెద్దగా పెట్టుబడి లేని వ్యాపారాలే. రోటీమిషన్ కొని మొదలుమొదలే రోజుకి కనీసం ఐదువేల రొట్టెలు అమ్మాలనేది అతని కోరిక. మడిగలు వాళ్లవే కాబట్టి ఒకదాంట్లో మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నాడు. వత్తిన రొట్టెలు గ్రీజ్ పేపరు మధ్యన చుట్టి ఇస్తే ఇంటికి తీసుకెళ్ళి కాల్చుకునేవాళ్ళు కాల్చుకుంటారనే ఆలోచనకూడా వుంది. ఖర్చులన్నీ పోను నెలకి లక్షాలక్షన్నర లాభాలిచ్చే వ్యాపారం అతని ఆలోచనల్లో సాగుతోందిగానీ ఇంకా ఆచరణలోకి రాలేదు. బెంగుళూర్లోని రామేశ్వరం కెఫే గురించి విన్నాడు. నెలకి మూడునాలుగు కోట్ల టర్నోవర్ట. అలాంటిదేదో చెయ్యాలని కల.
“ఇంట్లో దొరికేంత మంచి ఆహారం బయట దొరకడంలేదు. లాభం అనేది వ్యాపారవిస్తరణలోంచీ రావాలిగానీ నాణ్యత తగ్గించడంలోంచీ కాదు” అంటాడు. యువత ఆలోచనల్లో వస్తున్న మార్పుకి నిదర్శనంలా వుంటాయి అతని మాటలు.
“ఆ చేసే వ్యాపారమేదో చెయ్యచ్చుగా, గాల్లో మేడలు కట్టకుండా? ఖాళీగా వున్నాడని అందరూ వీడిని వాడుకుంటున్నారు” అని రోహిణి బాధపడుతుంది.
“ఇప్పుడు చెప్పరా!” అన్నాడు శ్యామ్మోహన్.
“ఏం చెప్పను?” అమాయకంగా అడిగాడు విజయ్.
“రేయ్, నీ నటన చాలుగానీ, ఆ యిల్లు కొని, ఆ పిల్లని అప్పుల్లోంచీ బైటికి లాగి, ఏదో ఒకలా వుద్ధరించాల్సిన అవసరం ఏం వుంది మనకి? ఢిల్లీలో మా పినతల్లి ఒకావిడ వుంది. ఒక్కర్తే వుంటోంది. ఈ పిల్లకీ ఎవరూ లేరు. అక్కడికి పంపిస్తే ఏదో ఒక వుద్యోగం చూసుకుని బతుకుతుంది. ఎవరేనా ముందుకొస్తే పెళ్ళీ చేద్దాం. అంతవరకూ చెయ్యచ్చు” అన్నాడు.
“అంత తప్పూ, నేరం తనేం చేసింది, ఏదో ఒకలా వదిలించుకోవడానికి? మెహర్బానీ చూపించుకోవడానికా, ఆమెని మనం ఇక్కడికి తీసుకొచ్చింది? ఇంట్లో కలుపుకుంటారనుకున్నాను” సూటిగా అన్నాడు విజయ్.
“చిన్నపిల్లాడిలా మాట్లాడకు. ఊరంతా రచ్చరచ్చగా వుంది వాళ్ళు చేసినపనికి. ఆ యిల్లు అమ్ముడుపోవడం ఎంత కష్టమో, అమృతమీద పడ్డ అపఖ్యాతి తొలగిపోవడమూ అంతే కష్టం. ఆడపిల్ల అని, వెంకడితో వున్న స్నేహాన్ని గుర్తుంచుకుని సాయంచేద్దామనుకున్నాం నేనూ, మీ నాన్నా. నువ్విలా చేస్తే లోకంలో ఎవరూ ఎవరికీ సాయపడరు” అన్నాడు శ్యామ్మోహన్ కొంచెం కోపంగా.
“ఇప్పటిదాకా మనం తనకి డబ్బేమీ ఇవ్వలేదు. చేస్తున్న సాయమల్లా, వాళ్ళ ఆస్తులు అమ్మి, అప్పులూ, బకాయిలూ తీర్చడమేకదా? కోపం తెచ్చుకోకుండా ఆలోచించండి బాబాయ్! నాన్న ఆశ్రయం ఇచ్చారు. మీరు ప్లీడరుగా సాయం చేస్తున్నారు. మనం కలగజేసుకోకపోతే ఆమె ఇంకో లాయర్ని వెతుక్కునేది. అంతకన్నా ఆమెకి ఇంకో దారిలేదు”
“ముందు పోలీసులు వెంటపడేవాళ్ళు”
“దానికన్నా ముందు టీవీలో వార్తలు చూసి నేను వెళ్ళేవాడిని. వదిలిపెట్టేవాడిని కాదు”
“ఎందుకు విజయ్, నీకు తనంటే అంత యిష్టం? ” విసుగ్గా అడిగాడు శ్యామ్మోహన్.
“ఇదంతా జరగకముందు ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. ఇంకా నయం, పెళ్లవలేదనుకుని ఇప్పుడు దులిపేసుకోనా? ఇదేనా బాబాయ్, మీరు మా యూత్‌కి నేర్పించేది?”
కంగుతిన్నాడు శ్యాంమోహన్. ఒకరి నిజాయితీగల ప్రవర్తన ఎదుటివాళ్లని ఇంత ఇబ్బందిపెడుతుందా? అర్థమవ్వలేదు. ’
“అమృతని నేను చేసుకోవడంవలన మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. పెద్దతాతయ్య ఎలాగా పెద్దవారయ్యారు. మా తాతయ్యకి ఇంత పెద్ద కుటుంబాన్ని నడపగల శక్తి లేదు. ఎవరికీ ఇంక కలిసి వుండే ఆలోచనకూడా లేదు. ఎవరికివాళ్ళకి బలవంతంగా బళ్ళో కూర్చోబెట్టినట్టో, హాస్టల్లో వున్నట్టో వుందట. ఎవరిది వాళ్ళకి పంచి ఇచ్చేస్తే ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదామనే ఆలోచనలోనూ, ఆతృతలోనూ వున్నారు. వాళ్ళవరకూ వాళ్ళకి అదొక కొత్త వొరవడి. కొత్త జీవితం. మా అకౌంట్లుకూడా ఏ నిముషాన్నేనా ఎవరిదివాళ్ళు తీసుకుని విడిపోవచ్చన్నంత స్పష్టంగా వుంటాయి. ఇన్నాళ్ళు ఓపికపట్టారంటే పెద్దాయనమీద వున్న గౌరవమే అనుకుంటాను. ఆస్తులన్నీ వాటాలేస్తే ఆ యిల్లు మా తాతకీ, ఆయన్నించీ నాన్నకీ, చివరిగా నాకూ వస్తుంది. అలా చేస్తే మిగతావాళ్ళెవరికీ అభ్యంతరం వుండదు. దాని విలువ తాత్కాలికంగా తగ్గచ్చుకానీ, ఎప్పటికీ అలానే వుండిపోదు” స్పష్టంగా అన్నాడు విజయ్.
“మీరు హిందూ అవిభక్త కుటుంబంగా రిజిస్టరవ్వలేదు. పెద్దతాతయ్యనుంచీ నేరుగా నీకు రాదు. మీ తాత ఇప్పుడే పంచనంటే?”
“ఎప్పుడో ఒకప్పుడు పంచుతారుకదా, అప్పుడేనా తీసుకుంటాను”
“అది డెడ్ అసెట్. మిగతా నలుగురూ ఆ కోటిన్నరా పెట్టుబడిగా పెట్టుకుని లాభాలు తీస్తుంటే ఆయన డబ్బు అక్కడ బ్లాకై వుండటాన్ని వప్పుకుంటాడా?”
“అన్ని నష్టాలకీ నేను సిద్ధమయే వున్నాను. నా డబ్బే బ్లాకైందనుకుంటాను. కాదూ, చీటీలడబ్బులన్నీ తిరిగిచ్చేసాక, వచ్చిన ధరకి ఇల్లమ్మేస్తే మిగిలిన అప్పులకి నేను పూచీపడతాను. మనవాళ్లదగ్గిరే తలో ఐదులక్షలో పదిలక్షలో వడ్డీకి తీసుకుంటాను. ఒకొక్కరికీ తీర్చుకుంటాను. వాసుదేవ్గారుకూడా సాయం చేస్తానన్నారు. ఆయన భార్య గీతగారు చాలామంచిది. ఎలాంటివాళ్ళనేనా ప్రేమగా దగ్గిరకి తీసే మనస్తత్వంకలది. వాళ్ళదగ్గిర చదువుకున్న పిల్లలు చెప్పారు. వాళ్ల చిన్నకొడుకు విహంగ్ నాకు బాగా పరిచయం. అమృతని వాళ్ళింటికి పంపిద్దామనుకుంటున్నాను. బాబాయ్! మీరెప్పుడేనా ఎడారిలో ఎండలో చుక్క మంచినీళ్ళు లేని అనుభూతి పొందారా? అమృతది ఇప్పుడు ఆ పరిస్థితి. పూర్తిగా తనకి అనుభవంలేని పరిస్థితుల్లో కూరుకుపోయి వుంది. నేను తనతో మాట్లాడ్డం అమ్మకిగానీ, ప్రసూనకిగానీ ఇష్టంలేదు. ప్రసూనైతే నన్ను కాపలాకాస్తోంది. ఎవరూ మాట్లాడకుండా, దగ్గిరకి తీయకుండా వుంటే ఆమె ఏమైపోతుంది? మూడునాలుగేళ్ళకిందట కాలేజిలో అమృతని చూసినప్పుడు నాకు చాలా ఇష్టం కలిగింది. తనెవరో నాకప్పుడు తెలీదు. తరువాత అమ్మ పెళ్ళిప్రస్తావన తెచ్చింది. చేసుకుంటానని చెప్పాను. పెళ్ళి అనేది మామధ్య జరగకుండా ఆగిన లీగల్ ప్రోసెస్ అంతేకదా? అలాంటి ఏ ప్రోసెస్ లేకుండానే మనుషులు కలిసి వుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. అంటే మనసూ, ఇష్టమే ప్రధానం”
“ఆ అమ్మాయికి నువ్వంటే యిష్టం లేకపోతే? తనున్న పరిస్థితినిబట్టి అవకాశం తీసుకుంటున్నావనుకుంటే? ఇంకెవర్నేనా ప్రేమించి వుంటే?”
విజయ్ నవ్వేసాడు. “నా మనసు మార్చడానికి మీరు అన్ని ప్రయత్నాలూ చేసేసారు. ఆమెని నేను ఇష్టపడుతున్నాను, తను నన్ను కాదు. కాబట్టి ఆమె యిష్టంప్రకారమే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె మరొకర్ని ప్రేమించగలగడం అంత తేలిక కాదు. రెక్కలిప్పుకుని ఎగిరిన సీతాకోకచిలుకతనం ఈ కష్టాల్లో ఇరుక్కుపోయింది. ఒకవేళ ఇప్పటికే ఎవర్నేనా ప్రేమించి వుంటే అతను సరిగ్గా మీరెలా ఆలోచిస్తున్నారో, అలాగే ఆలోచించి తప్పుకుంటాడు. అలాంటివాడు వుంటే ఈపాటికి ముందుకి రావాలి. కనీసం తనెలా వుందో తెలుసుకోవాలి. అదీ జరగలేదు” అని, “అమృతకి నేనంటే ఇష్టమే. క్లాసులు జరుగుతున్నంతసేపూ ఒకళ్ళనొకళ్ళం చూసుకునేవాళ్ళం” అన్నాడు రహస్యం చెప్తున్నట్టు.
“పోరా!” అని లేచాడు శ్యాంమోహన్.
“పిల్లలు అన్ని నిర్ణయాలూ తీసుకున్నాకే మనముందుకి వస్తున్నారు. నీ కొడుకూ అంతే” అని మాధవరావుతో త్రిమూర్తులి నిర్ణయం, తనకీ విజయ్‌కీ మధ్య జరిగిన సంభాషణా చెప్పాడు. తను ఆలోచించాల్సిన విషయాలూ, నిర్ణయాలూ కొడుకు తీసుకున్నందుకు మాధవరావు అహం దెబ్బతింది. రోహిణికీ కొడుకుమీద కోపం వచ్చింది. ఒక తరంలో రామారావు, తర్వాత అదే యింట్లో గీత, ఇప్పుడు ఇక్కడ విజయ్. చాలాకొద్దిమందికి తమకేం కావాలో తెలిసే స్పష్టత వుంటుంది. దాని చుట్టూ ఎలాంటి లౌక్యపు పొరలూ వుండవు. సర్దుబాట్లు, మినహాయింపులూ చేసే వీలూ వుండదు. అందులోని సత్యం నేరుగా కనిపిస్తుంది. సూటిగా తాకుతుంది. తట్టుకోవడం కష్టం.
“ముందూవెనకా చూడకుండా తెచ్చి ఆ పిల్లని నెత్తిన తెచ్చి పెట్టారు. నాకా పిల్లమీద కోపమేమీ లేదు. పుట్టెడు దు:ఖంలో మనిల్లు చేరింది. మిగతావి ఎలా వున్నా తల్లీతండ్రీ ఒక్కసారి పోయారంటే అదేం చిన్నవిషయం కాదు. దాని దు:ఖంలో అది కూరుకుపోయి వుంది. కన్నెత్తి వాడికేసికూడా చూడలేదట. ప్రసూనే చెప్పింది ఆమాట. వీడేమిటి యిలాగ? పెద్దాయనా, మీ అమ్మా వాడిని సమర్ధించడమేమిటి? లేనింటిపిల్లలని తెచ్చి చేసుకున్నారు మీయింట్లో. ఐనా మా పుట్టిళ్ళలో కష్టాలల్లో మిమ్మల్నెవర్నీ ఇరికించలేదు మేమెవ్వరం. వీడిలా చేస్తుంటే ఆ పిల్లమీద నాకు ప్రేమ ఎలా పుడుతుంది? దగ్గిరకి తీసుకుని వోదార్చబుద్ధి ఎందుకు పుడుతుంది? ” అంది రోహిణి భర్తతో విసురుగా.
నిద్రపోవటాలూ, లేవటాలూ, వండుకోవటాలూ, తినటాలూ… ఇవన్నీ మనసుతో పెద్దగా సంబంధం లేకుండా యాంత్రికంగా జరిగిపోతాయి. మనసు తన పని తను చేసుకుంటుంది. జ్ఞాపకాలు నెమరేసుకుంటూనో, బాధలని తవ్విపోసుకుంటూనో ఒక నీడలా దినచర్యతోపాటుగా కదుల్తూ వుంటుంది. ఒక్కోసారి మధ్యాహ్నపు ఎండలోలాగ నీడ అసలే వుండదు. అంటే మనిషి దు:ఖంలోనో, చింతనలోనో పూర్తిగా నిమగ్నమైపోయాడన్నమాట.
తనచుట్టూ అల్లుకుపోయిన చిక్కుముళ్ళలాంటి బంధాలని ఇప్పుకుని, తనని తను వాటిలోంచీ దూరం జరుపుకునే ప్రయత్నం చేస్తునే వుంది గీత. కొన్ని అనుభవాలు మహతితో పంచుకుంది. ఇంకొన్నిటిని బయటికి అనలేదు. కానీ అవి తమకుటుంబంలోని గొడవలుగా అందరికీ తెలుసు. కానీ తనకి? కాళ్ళకింది నేల కదిలినట్టో, సుఖంగా బతక్కుండా ఆటంకాలనో అనిపించాయి. సుమతి పెళ్ళి తర్వాత ప్రహ్లాద్ పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళి వాళ్ళ కుటుంబంలో ప్రళయానికి నాందీవాక్యం పలికింది. అది ప్రళయమని చాలాకాలనికిగానీ ఎవరికీ అర్థమవలేదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.